తుది దశకు మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో డీపీఆర్​లు

తుది దశకు మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ  మెట్రో డీపీఆర్​లు
  • సాయిల్ టెస్టులు, ట్రాఫిక్ సర్వేలు పూర్తి
  •  ఏప్రిల్ ఫస్ట్​ వీక్​లో రాష్ట్ర ప్రభుత్వానికి మేడ్చల్, శామీర్ పేట, ఫోర్త్ సిటీ డీపీఆర్​లు 
  • సీఎం విధించిన గడువులోపు పూర్తి చేసేందకు మెట్రో కసరత్తు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సెకండ్​ఫేజ్​పార్ట్–ఏలోని నార్త్ సిటీ మెట్రో డీపీఆర్​ల ప్రిపరేషన్ పూర్తి కావొచ్చింది. ఈ రెండు కారిడార్లకు సంబంధించి సాయిల్​టెస్టులు, సర్వేలు పూర్తయ్యాయి. ఈ నెల చివరి నాటికి ఇతర అంశాలను కూడా డీపీఆర్ లో చేర్చి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మేడ్చల్, శామీర్ పేట్ తో పాటు ఎయిర్​పోర్ట్​నుంచి ఫ్యూచర్ సిటీకి నిర్మించబోయే మెట్రో డీపీఆర్ కూడా మార్చిలోపు ఇవ్వాలని సీఎం ఆదేశించినా.. ఫ్యూచర్​సిటీ డీపీఆర్ లేట్ అయ్యేలా కనిపిస్తోంది.

మేడ్చల్ రూట్​లో డబుల్ డెక్కర్ నిర్మించాలా, లేక ప్రత్యేక రూట్​లో ఎలివేటెడ్ మార్గం నిర్మించాలా అనేది ఫైనల్ కానట్లు తెలుస్తున్నది. అయితే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి నార్త్ సిటీ పెండింగ్ లో ఉన్న ఇతర అంశాలను చేర్చి, ఫోర్త్ సిటీ డీపీఆర్ ను కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఆర్థిక, సాంకేతిక, సామాజిక అంశాల సేకరణ పూర్తి 

మెట్రో డీపీఆర్ రూపకల్పనలో ఎకనామికల్, సోషల్, టెక్నికల్​అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కమర్షియల్ ఏరియాలు, జనసాంద్రత ఆధారంగా రైల్వే స్టేషన్ల ఎంపిక చేశారు. జేబీఎస్–-మేడ్చల్ మార్గంలో 25 ప్రాంతాల్లో, జేబీఎస్–-శామీర్‌‌‌‌పేట మార్గంలో 19 ప్రాంతాల్లో భూపరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ సర్వేలో భాగంగా రోజూవారీ ప్రయాణికుల సంఖ్య, శామీర్‌‌‌‌పేట, మేడ్చల్ ప్రాంతాల్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్​, ఐటీహబ్ లు, రెసిడెన్షియల్ ఏరియాల ఆధారంగా ట్రాన్స్​పోర్ట్​ను అంచనా వేసి డీపీఆర్​రెడీ చేస్తున్నారు.  

ఐదు కారిడార్ల ఆమోదం కోసం కసరత్తు

కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న సెకండ్​ఫేజ్​పార్ట్​ఏలోని ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్​ల ఆమోదం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి మెట్రో పొడిగింపునకు సహకరించాలని కోరారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు డీపీఆర్​మాత్రం ఆమోదం పొందలేదు. మెట్రో అధికారులు కూడా సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

త్వరలోనే ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్​లు ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తున్నది. కేంద్రంలో డీపీఆర్​లు ఆమోదం పొందితే, కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు సేకరించడానికి అనుమతి లభిస్తుంది. డీపీఆర్​లు ఆమోదం పొందితే మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ఊపందుకోనున్నాయి.